భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో నమోదయిన కార్మికులందరికీ ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ. 10 వేలు చొప్పున ఆర్ధిక సాయం అందించాలని టిఎన్టీయుసీ జిల్లా అధ్యక్షులు, ఎపి మినిమం వేజెస్ బోర్డు డైరెక్టర్ నక్కా చిట్టిబాబు కోరారు. దీనిపై ఆయన కార్మిక సంఘాల ప్రతినిధులతో కలసి రాజమహేంద్రవరం ఎవిఎ రోడ్డులోని కార్మిక శాఖ కార్యాలయంలో జిల్లా కార్మిక శాఖ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. అలాగే రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ గారికి ఫాక్స్ ద్వారా వినతి పత్రం పరంపారు. బోర్డులో ఇప్పటి వరకూ నమోదయిన కార్మికులందరికీ తప్పనిసరిగా ఆర్ధిక సాయం అందించాలని కోరారు. ఈ సందర్భంగా నక్కా చిట్టిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా తయారవుతుందని, ఒక పక్క ఇసుక కొరత మరో పక్క కరోనా దెబ్బతో పనులు లేక కార్మికులు అల్లాడిపోతున్నారన్నారు. అనేక మంది కార్మికులు కనీసం తినడానికి తిండిలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. ముఖ్యంగా సంక్షేమ బోర్డులో ఇప్పటి వరకూ సుమారు 22 లక్షల మంది కార్మికులు సభ్యులుగా నమోదయి ఉన్నారని, అయితే ఇటీవల ప్రభుత్వ ఆర్ధిక సాయానికి మాత్రం 8 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారని, అనేక మంది కార్మికులకు ఈ దరఖాస్తుపై అవగాహన లేమి, విషయం తెలియకపోవడం తదితర కారణాలతో అనేక మంది దరఖాస్తు చేయలేకపోయారన్నారు. కావున ప్రభుత్వం తక్షణం బోర్డులో నమోదయిన కార్మికులందరికీ ఎటువంటి నిబంధనలు లేకుండా ఆర్ధిక సాయం అందించాలని అన్నారు. ప్రధానంగా ఇటీవల ఆర్ధిక సాయంకోసం దరఖాస్తు చేసిన సుమారు 8 లక్షల మంది కార్మికుల కు తొలివిడతగా వెంటనే ఆర్ధిక సాయం అందించాలన్నారు. బోర్డులో నమోదయిన కార్మికులు అందరికీ 2వ విడతగా, కొత్తగా నమోదు చేయించుకున్నవారందరికీ 3వ విడతగా సాయం అందించాలన్నారు. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో 2 యూనిట్ల ఇసుక రూ.2,600 లకు వచ్చేదని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు తీవ్రమైన ఇసుక కొరత ఏర్పడమే కాకుండా ప్రస్తుతం 2 యూనిట్ల ఇసుక 6 వేల నుంచి 12 వేలు ధర పలుకుతుందన్నారు. దీనివల్ల సామాన్యులు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా పోవడంతో పాటు పూర్తిగా పనులు లేక కార్మికులు పస్తులుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఏడాది గడచినా ఇసుక కొరతను తీర్చలేకపోయారన్నారు. అంతే కాకుండా మార్చి 22 నుంచి విధించిన లాక్ డౌన్ కారణంగా పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఇళ్ళకే పరిమితమయ్యారని, దీనివల్ల అనేక మంది కార్మికుల కుటుంబాలు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారన్నారు. ఆకలివేసినప్పుడే అన్నంపెడితే కడుపునిండుతుంది, కనుక ఆకలితో అలమటిస్తున్న భవననిర్మాణ కార్మికులందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈకార్యక్రమంలో.... భవన నిర్మాణకార్మిక సంఘము టిఎన్టీయుసీ అనుబంధం ప్రెసిడెంట్ యాళ్ల శ్రీనివాస్, జిల్లా ఉప అధ్యక్షులు తిడ నరిసింహమూర్తి, ప్లబింగ్ వర్క్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పరిగల రమేష్, రాడ్ బెండింగ్ అండ్ సెంట్రింగ్ వర్క్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గణేష్ భవన నిర్మాణ కార్మిక సంఘము ఉప అధ్యక్షులు పేదగాధ తుదాచార్యులు, విశ్వ కర్మ వడ్రంగి సంఘము ఉప అధ్యక్షులు మత్తుర్తి బుచ్చిబాబు మల్లయ్యపేట తాపీ పని సంఘము అధ్యక్షులు నాలాం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. (IRA NEWSPAPER)