X Close
X
9440451836

ల్యూటెన్ నిబంధనలకు రాజకీయ రంగు


076ea1_b992082c63e64be0907ed4b5748d40b0~mv2
కొన్ని విషయాల్లో కొందరికి సమాచార లోపం ఉంటుంది. కానీ అన్నీ తెలిసినట్టే మాట్లాడేస్తారు. దానికి కారణం ఒక్కటే వారి మనస్సులో కొందరిపై ఉన్న స్థిరాభిప్రాయాలు. ఇది చాలాసార్లు రైటు కావచ్చు.. కొన్నిసార్లు తప్పు కూడా అయ్యే అవకాశం ఉంది, ప్రియాంక వాద్రా ఇంటి ఉదంతం కూడా ఈ కోవలోకే వస్తుంది. చాలామంది ఆమె ఏ అర్హత లేకుండా అధికారిక నివాసంలో ఇంతకాలం అక్రమంగా నివసించినట్టు, మోడీ సర్కారు ఇంతకాలానికి ధైర్యంగా బయటికి తోసేసినట్టు చెబుతున్నారు. కానీఇక్కడ తెలుసుకోవలసిన రెండు విషయాలు ప్రధానం. ఒకటోది ఆమెకు ఈ ఇల్లు ఇచ్చినది ఎస్పీజీ రక్షణ పరిధిలో ఉండడం వలన మాత్రమే. ఇవాళ ఇల్లు ఖాళీ చేయమని చెప్పినది ఎస్పీజీ పరిధినుంచి ఆమె కుటుంబాన్ని మినహాయించడం వలన మాత్రమే తప్ప మరో కారణం కాదు! అంచేత ఆమె కుటుంబం అక్రమంగా ఆ బంగ్లాలో నివసించినట్టు చెప్పడానికి ఆస్కారం లేదు.. అప్పుడు ఇవ్వడానికి.. ఇప్పుడు పంపేయడానికీ ఒక్కటే కారణం.. అది ఎస్ పి జి రక్షణ నిబంధనావళి.నిజానికి ప్రియాంక వాద్రాకి లోది ఎస్టేట్ లోని 6 బి టైపు బంగ్లాని 1997 లో కేటాయించారు. అప్పుడు దేశంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు ఇది జరిగింది. అంతకుముందు ప్రధానిగా ఉన్నది వాజపేయి. అంతకు ముందు ప్రధానమంత్రి పివి నరసింహారావు. అంటే ప్రియాంకకి ఈ ఇల్లు కేటాయించడానికి ముందు ఆరేళ్ళు కూడా అధికారం ఆ కుటుంబం గుప్పిట్లో అయితే లేదు. ల్యూటెన్ జోన్ లో ఇల్లు అందరికీ ఇవ్వరు. ఆ జోన్ మొత్తం ఎస్ పి జి పర్యవేక్షణలో ఉంటుంది. ఎస్ పిజి పరిధిలో ఉన్నవారిని మాత్రమే అక్కడ నివసించడానికి అనుమతిస్తారు... ఇది ఒక కోణం అయితే... ఎస్ పిజి రక్షణ ఉన్నవారు ఈ జోన్ లో ఉంటేనే భద్రతా చర్యల నిరంతర పర్యవేక్షణకు వీలవుతుంది అనేది ఇంకో కోణం. ఈ ప్రాతిపదికనే ప్రియాంక వాద్రా కుటుంబానికి ఈ బంగ్లా కేటాయింపు జరిగింది. 2,765.18 చదరపు అడుగుల విస్తీర్ణం కల ఈ ఇంటికి అద్దెగా 28,451 రూపాయలు నిర్ణయించారు. ఆ అద్దె 31300 వరకూ పెరిగింది. తదుపరి మళ్ళీ వాజపేయి ప్రధానిగా వచ్చారు. 2000 సంవత్సరంలో కావచ్చు.. వాజపేయి ప్రభుత్వం భవంతుల అద్దెలు సవరించింది. ప్రియాంక వాద్రా నివసిస్తున్న భవనానికి కిరాయిని 53421 రూపాయలకి పెంచారు. అప్పుడామె అంత అద్దె కట్టుకోలేను అని విన్నవించుకుంటే దయతో వాజపేయి సర్కారు కేవలం 8888 రూపాయలకి తగ్గించేశారు. ఇదీ ఈ బంగ్లా కేటాయింపు .. అద్దె వ్యవహారం.ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చాకా గత నవంబర్ లో అనేకమంది ప్రముఖులను ఎస్ పి జి పరిధి నుంచి బయటికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ప్రియాంక వాద్రా జెడ్ ప్లస్ సెక్యూరిటీ పొందుతున్నారు.. ఆమెకు సీఆర్పీఎఫ్ జవాన్లు రక్షణ కల్పిస్తున్నారు. అలా ప్రియాంక వాద్రాను కూడా ఎస్ పి జి నుంచి బయటకు తీసుకురాబట్టే.. ఇప్పుడు ఆమెను ఇల్లు ఖాళీ చేయమన్నారు. ఎస్ పిజి పరిధిలో ఆమె ఉంటే ఇల్లు ఖాళీ చేయమని అడిగే ప్రసక్తే తలెత్తదు. వాజపేయి హయాంలో ప్రియాంక వాద్రా అద్దె తగ్గింపు వరం పొందాకా అద్దె రెగ్యులర్ గా కడుతున్నారు గానీ.. అంతకుముందు భారీ బకాయి ఉంది. ఈ బకాయి మొత్తాన్ని అంటే 3,46,677 రూపాయల్ని ఆమె ఈనెల మొదటివారంలో చెల్లించారు.కొందరి అత్యుత్సాహపు ప్రచారం చూస్తుంటే.. మోడీ సర్కారు కత్తి గట్టి కావాలనే సోనియా కుటుంబాన్ని వేధిస్తున్నట్టు.. అందులో భాగంగానే ప్రియాంకని మెడపట్టి గెంటేసినట్టు మనకి అర్థమవుతుంది. కానీ ఇది తప్పు. మోడీ ప్రభుత్వం నిర్ణీత విధానం ప్రకారమే వ్యవహరించింది తప్ప కక్షసాధింపు ధోరణితో ఏ చర్యా తీసుకోలేదు.ఇంకో సంగతి... సోనియా గాంధీ జనపథ్ రోడ్డు లోని పదో నంబర్ నివాసం లో ఉంటున్నారు. ఆమెను కూడా వెళ్ళగొట్టాలని.. ఇందులో ఆమె నివాసం అక్రమమని కూడా చెదరాతలు రాసేస్తున్నారు కొందరు.నిజానికి పది, జనపథ్ నివాసం మాజీ ప్రధానమంత్రి హోదాలో రాజీవ్ గాంధీకి విపి సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో (1989) కేటాయించబడింది. ఆయన మరణానంతరం ఈ నివాసంలో సోనియాగాంధీ (దివంగత ప్రధాని సతీమణి హోదాలో) జీవితాంతం నివసించడానికి అనుమతించారు. అదీగాక ఆమె ఎస్ పి జి రక్షణలోనే ఉన్నారు. కాబట్టి ఏ లెక్క ప్రకారం చూసినా సోనియా గాంధీని పది జనపథ్ నుంచి ఖాళీ చేయించే అవకాశం లేదు.. అలాంటి ఆలోచన కూడా కేంద్రప్రభుత్వం మదిలో లేదు. అత్యుత్సాహంతో సోషల్ మీడియా భక్తగణం చేసే తప్పుడు ప్రచారాలు ప్రభుత్వం ఒక పధ్ధతి ప్రకారం చేసే పనులకి కూడా రాజకీయ రంగు అంటిస్తున్నాయి. (IRA NEWSPAPER)