X Close
X
9440451836

సామాన్య కుటుంబంనుంచి.. అసామాన్య నేతగా ఎదిగిన సోము వీర్రాజు


076ea1_f0fa765b1de74a6db090767d6a448286~mv2
భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము రాజకీయ ప్రస్థానం... బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా సోము వీర్రాజు ఎంపిక పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలకు కారణమైంది. నిజమైన కార్యకర్తకు లభించిన గౌరవంగా, గుర్తింపుగా దీనిని అభివర్ణిస్తున్నారు. ఆయన రాజమండ్రి రూరల్ మండలంలోని నగర శివారు గ్రామం కాతేరులో అతి సామాన్య కుటుంబంలో 1957 లో జన్మించారు. ఇరవై మూడేళ్ల వయసులోనే బీజేపీలో ప్రవేశించిన వీర్రాజు స్వతహాగా ఆరెస్సెస్ కార్యకర్త. పార్టీ సిద్ధాంత భావజాలాల్ని అణువణువునా రంగరించుకున్న నిబద్దత ఆయనది. ప్రజాసమస్యలపై సిద్ధాంత సమరం చేయడంలో ఆయన శైలి విశిష్టమైనది.తూర్పు గోదావరిలో పోలవరం ముంపు గ్రామాల విలీనంలో ఆయన పోషించిన కీలక పాత్ర విస్మరించరానిది. అయన విద్యాభ్యాసం రాజమండ్రిలోని దానవాయిపేట మునిసిపల్ హై స్కూల్, వీటి కాలేజీ, భీమవరం డి ఎన్ ఆర్ కళాశాలల్లో సాగింది. బాల్యంలోనే ఆరెస్సెస్ తో, విద్యార్ధి దశలో ఎబివిపితో సాన్నిహిత్యం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ౧౯౭౮లోనే ఆయన జనతా యువమోర్చా నగర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1980 లో భారతీయ జనతా యువమోర్చాలో జిల్లా ప్రధానకార్యదర్శి పదవిని చేపట్టారు. ఆ తర్వాత బిజెపి జిల్లా కార్యదర్శిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏడేళ్లు పనిచేసారు. 1987 -1990 యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. 1991 -94 బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 1994 నుంచి 1996 వరకూ బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు. 1996 నుంచి 2003 వరకు రాష్ట్ర బిజెపి కార్యదర్శిగా వ్యవహరించారు. 2003 లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయ్యారు. మళ్ళీ 2006 నుంచి 2010 వరకూ తిరిగి 2010 నుంచి 2013 వరకూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు వరించాయి. 2013 తర్వాత జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఉన్నారు. 2015 లో శాసనమండలి సభ్యుడయ్యారు. ఆయన వహించిన మొట్టమొదటి ప్రజాపదవి ఇదే. కన్నలక్ష్మీనారాయనని అధ్యక్షునిగా చేసినప్పుడు పార్టీ క్యాడర్ అంతా సోము వీర్రాజునే కోరుకుంది. అయితే కొన్ని సమీకరణాల దృష్ట్యా అప్పుడలా చేసిన పార్టీ నాయకత్వం వీర్రాజును రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ గా నియమించి తగురీతిన గౌరవించింది. తెలుగుదేశం పొత్తులో ఉమ్మడి అభ్యర్థిగా ఒకసారి, బిజెపి అభ్యర్థిగా పలుమార్లు సోము వీర్రాజు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేసారు. పార్టీ ప్రకటించిన ఏ కార్యక్రమమైనా సరే తిరుగులేని నిబద్ధతతో, అకుంఠిత కృషితో నెరవేర్చడం.. కార్యకర్తలను, నాయకుల్ని తనమాట జవదాటకుండా నడిచేలా చూసుకోవడం ఆయన సమర్థతకు నిదర్శనం. ఆయన ఉభయగోదావరి జిల్లాలకు పార్టీ జోనల్ ఇన్ చార్జిగా ఉన్న సమయంలోనే గోదావరిజిల్లాల్లో బిజెపి విజయభేరి తొలిసారిగా మ్రోగింది. కృష్ణంరాజు, ముద్రగడ పద్మనాభం, గిరజాల వెంకట స్వామినాయుడు, అయ్యాజీ వేమా, పైడికొండల మాణిక్యాలరావు, ఆకుల సత్యనారాయణ తదితరులు పోటీ చేయడం వెనుక, గెలిచి అత్యున్నత స్థానాలను పొందడం వెనుక పార్టీ పరంగా సోము వీర్రాజు పోషించిన పాత్ర అనన్యసామాన్యం. ప్రజానాడిని అంచనా వేయడంలో.. సరైన అభ్యర్థులను వెతికి పట్టుకొని పార్టీలోకి తీసుకురావడంలో వీర్రాజు సమర్థత, చాకచక్యం ఆశ్చర్యం కలిగిస్తాయి. అందుకే ఈ కీలక సమయంలో వీర్రాజు బిజెపి రాష్ట్ర సారథ్యం చేపట్టడం సరికొత్త చరిత్రను ఆవిష్కరిస్తుందనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. ఏ పార్టీతోనూ పొత్తును సహజంగా ఇష్టపడని స్వభావం వీర్రాజుది. పార్టీ స్వతంత్రంగా ఎదగాలన్నదే ఆయన ఆంతర్యం. టిడిపికి, వైకాపాకి సమదూరాన్ని పాటిస్తూ.. పార్టీ అధిష్టానం నిర్ణయించిన జనసేనతో అవగాహన కొనసాగిస్తూనే పార్టీని రాష్ట్రవ్యాప్తంగా ఆయన బలోపేతం చేస్తారన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది. (IRA NEWSPAPER)